defence: చైనా సైనికులతో మన రక్షణ మంత్రి ముచ్చట్లను స్వాగతించిన చైనా మీడియా!
- నిర్మలా సీతారామన్‌పై ప్రశంసల వర్షం
- సరిహద్దులో పర్యటించిన మంత్రి
- ద్వైపాక్షిక వాణిజ్యానికి తోడ్పాటు
సిక్కింలోని నాథూ లా సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న చైనా సైనికులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముచ్చటించారు. వారితో ఇంగ్లిషులో మాట్లాడి, నమస్తే పదాన్ని చైనా భాషలో ఎలా పలకాలో తెలుసుకున్నారు. తమ సైనికులతో భారత రక్షణ మంత్రి స్నేహంగా వ్యవహరించడాన్ని చైనా అధికారిక మీడియా స్వాగతించింది. నిర్మలా సీతారామన్‌పై ప్రశంసల వర్షం కురిపించింది.
సైనికులతో చొరవగా మసులుకోవడం వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబడి, ద్వైపాక్షిక వాణిజ్యం మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇటీవల భారత్ - చైనాల మధ్య డోక్లాం ప్రాంతం విషయంలో సరిహద్దు వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు తమ తమ సైనిక బలగాలను దింపడంతో దాదాపు 70 రోజుల పాటు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత జరిగిన చర్చల పుణ్యమాని ఇరుదేశాలు యథాతథస్థితిని కొనసాగించాలని నిర్ణయించడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.