h1b: కొత్త ఇమ్మిగ్రేష‌న్ ప్ర‌ణాళిక‌ను ప్ర‌తిపాదించిన ట్రంప్‌!

  • హెచ్‌-1బీ ప్ర‌స్తావ‌న లేదు
  • ప్ర‌తిభ ఆధారంగా గ్రీన్‌కార్డులు
  • భార‌తీయుల‌కు లాభం?

త్వ‌ర‌లో ప్ర‌తిభ ఆధారంగా వ‌ల‌స విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు అమెరికా ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే 70 అంశాల‌తో కూడి ఉన్న స‌రికొత్త వ‌ల‌స విధాన ప్ర‌ణాళిక‌ను రూపొందించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్‌కు పంపించారు. ఇందులో ప్ర‌తిపాదించిన అంశాల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అయితే ఇందులో హెచ్‌-1బీ వీసాల గురించి ట్రంప్ ప్ర‌స్తావించ‌లేదు. ఈ ప్ర‌ణాళిక ప్ర‌కారం అమెరికాలో ఉంటున్న విదేశీయుల జీవిత భాగస్వామి, పిల్లలకు మాత్రమే గ్రీన్‌కార్డు అంద‌జేస్తారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు , తల్లిదండ్రులను అనుమతించరు. సమానత్వం, ఆర్థిక విజయం సాధించేందుకు విద్య, ఉద్యోగ అర్హత, ఇంగ్లిష్‌ స్పష్టంగా మాట్లాడే నేర్పు అంశాల ఆధారంగా గ్రీన్‌కార్డులు ఇవ్వడమే ప్రతిభ ఆధారిత వ్యవస్థ అంటూ ప్ర‌ణాళిక పేర్కొంది.

అయితే ఈ ప్ర‌తిభ ఆధారిత వ్య‌వ‌స్థ వ‌ల్ల భార‌తీయుల‌కు లాభ‌మా? న‌ష్ట‌మా? అనే విష‌యంపై మిశ్ర‌మ అభిప్రాయాలు వెలువ‌డుతున్నాయి. 11 ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న ప్ర‌తిభ గ‌ల భార‌తీయుల‌కు ఈ విధానం వ‌ల్ల త్వ‌ర‌గా గ్రీన్ కార్డు ల‌భించే అవ‌కాశం ఉంది. ప్ర‌ణాళిక‌లో చెప్పిన‌ట్లు ఏడాదికి ఒక దేశానికి 20,000 గ్రీన్‌కార్డులు మాత్రమే పరిమితం చేస్తే భారత్‌కు ప్రయోజనకరం అని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  • Loading...

More Telugu News