speaking pm: మేమీ దేశానికి మాట్లాడే ప్రధానిని ఇచ్చాం.. నెహ్రూ-గాంధీ కుటుంబం ఏమిచ్చింది?: నిప్పులు చెరిగిన అమిత్ షా
- రాహుల్‌పై మరోమారు విరుచుకుపడిన అమిత్ షా
- గెలిచి కనిపించకుండా పోయిన ఎంపీని తొలిసారి చూస్తున్నా
- రాహుల్ కుటుంబం అమేథీకి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోమారు నిప్పులు చెరిగారు. బీజేపీ మూడేళ్ల పాలనలో ఈ దేశానికి ఏం చేసిందన్న రాహుల్ ప్రశ్నకు షా స్పందిస్తూ.. తామీ దేశానికి మాట్లాడే ప్రధానిని ఇచ్చామని, నెహ్రూ-గాంధీ కుటుంబం ఏమిచ్చింది అడిగారు. గుజరాత్లో అభివృద్ధి గురించి రాహుల్ మాట్లాడడంపైనా ఆక్షేపించారు. మూడు తరాలుగా అమేథీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ కుటుంబం ఆ నియోజకవర్గానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అమేథీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘బీజేపీ ఏం చేసిందని రాహుల్ పదే పదే ప్రశ్నిస్తున్నారు. మేమీ దేశానికి మాట్లాడే ప్రధానిని ఇచ్చాం’’ అని అమిత్ షా పేర్కొన్నారు. ‘‘మీరు 60 ఏళ్లపాటు ఓ కుటుంబాన్ని విశ్వసించారు. ఇప్పుడు బీజేపీని, ప్రధాని మోదీని నమ్మండి. మీరు ఇక మోసపోరు’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ రెండు అభివృద్ధి నమూనాలు ఉన్నాయని, అందులో ఒకటి నెహ్రూ-గాంధీ మోడల్ కాగా, మరొకటి ‘మోదీ మోడల్’ అని అన్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వం మొత్తం 106 ప్రాజెక్టులు ప్రారంభించిందని తెలిపారు. కాంగ్రెస్ 70 ఏళ్లపాటు ఈ దేశాన్ని పాలించిందని, ఇక్కడి నుంచి రాహుల్ చాలా కాలంగా ఎంపీగా ఉన్నారని, కానీ ఇప్పటి వరకు ఇక్కడ కలెక్టర్ కార్యాలయం, టీబీ ఆసుపత్రి, రేడియా కేంద్రం ఎందుకు లేవని షా ప్రశ్నించారు.
ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి (రాహుల్) కనిపించకుండా పోవడం 35-40 ఏళ్లలో తొలిసారి చూస్తున్నానని, పరాజయం పాలైన వ్యక్తి (స్మృతి) మాత్రం ప్రజల కోసం సమయం కేటాయిస్తున్నారంటూ రాహుల్‌ను ఎద్దేవా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేతిలో స్మృతి ఇరానీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బహిరంగ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.