california: దావానలం గుప్పిట్లో కాలిఫోర్నియా... వేగంగా విస్తరిస్తున్న కార్చిచ్చు
- లక్ష ఎకరాలను దహించి వేసిన దావాగ్ని
- అత్యవసర పరిస్థితి విధించిన గవర్నర్
- సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం దావానలం గుప్పిట్లో నలిగిపోతోంది. ఈ భయంకర అగ్నికీలలకు ఇప్పటికే 11మందికి పైగా బలయ్యారు. వేగంగా విస్తరిస్తున్న కార్చిచ్చు ఇప్పటికే 2000కు పైగా ఇళ్లు, వ్యాపార సముదాయాలను ఆహుతి చేసింది. ఆదివారం ప్రారంభమైన ఈ దావాగ్నికి గంటకు 80 కి.మీ.ల వేగంతో వీస్తున్న గాలులు కూడా తోడవ్వడంతో అగ్నిజ్వాలలు విపరీతంగా ఎగిసిపడుతున్నాయి.
సొనోమా, నాపా, మెండోచినో ప్రాంతాల్లో దాదాపు లక్ష ఎకరాలకు పైగా ప్రాంతాన్ని కార్చిచ్చు కమ్మేసింది. నాపా ప్రాంతం నుంచి రెడ్డింగ్ ప్రాంతాల మధ్య దాదాపు 320 చదరపు కి.మీ.ల మేర 18 చోట్లు దావాగ్ని జ్వాలలు మండుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఆ ప్రాంతంలో నివసించే వారందరిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.