kajal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు కాస్త ఊరటనిచ్చిన మద్రాస్ హైకోర్టు!
- వీవీడీ వ్యాపార ప్రకటనలో నటించిన కాజల్
- గడువు ముగిసినా ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- రూ. 2.5 కోట్ల నష్టపరిహారానికి డిమాండ్
- కింది కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే
గడువు ముగిసిన తరువాత కూడా తన యాడ్ ను ప్రసారం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ, వీవీడీ అండ్ సన్స్ పై కింది కోర్టును ఆశ్రయించి భంగపడిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు మద్రాస్ హైకోర్టులో మాత్రం కాస్తంత ఊరట లభించింది. వీవీడీ అండ్ సన్స్ తయారు చేస్తున్న కొబ్బరి నూనెకు ప్రచారం చిత్రంలో తాను నటించానని, గడువు ముగిసిన తరువాత కూడా దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి తనకు రూ. 2.5 కోట్లను నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ, గతంలో కాజల్ కోర్టును ఆశ్రయించారు.
దీన్ని విచారించిన న్యాయమూర్తి రవీంద్రన్, కాపీ రైట్ చట్టాలను ఉటంకిస్తూ, సదరు సంస్థకు 60 సంవత్సరాల పాటు హక్కులు ఉంటాయని చెబుతూ కేసును కొట్టివేశారు. దీనిపై కాజల్, మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ దాఖలు చేయాలని వీవీడీని కోర్టు ఆదేశించింది. ఇచ్చిన గడువులోగా ప్రతివాదుల నుంచి స్పందన రాకపోవడంతో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. కాగా, ఈ స్టే తాత్కాలికమేనని, వీవీడీ సంస్థ హైకోర్టుకు వచ్చి కాపీరైట్ చట్టాలను చూపితే, కాజల్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.