ramgopal varma: ఫ్రీగా ఉంటే టైము, ప్లేసూ చెప్పు... నా పని మానుకొని వస్తా: సోమిరెడ్డికి వర్మ సవాల్
- బహిరంగ చర్చకు సిద్ధం
- రావాలని సోమిరెడ్డికి సలహా
- చిన్నప్పటి నుంచి ఇన్ని తెలివితేటలా? అని వ్యంగ్యాస్త్రాలు
ఎన్టీఆర్ గురించి రామ్ గోపాల్ వర్మకన్నా ఎక్కువ తనకు తెలుసునని మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని వర్మ సవాల్ విసిరాడు. ఖాళీగా ఉన్నప్పుడు సోమిరెడ్డి సమయాన్ని, ప్రదేశాన్ని చెప్పాలని, ముంబైలో తన పనులు ముగించుకుని వస్తానని చెప్పాడు. ఇక అంతకుముందు రాజకీయ లక్ష్యాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను నిర్మాతగా పెట్టుకున్నారని సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "ఛా! మా నాయనే... నీ ఇల్లు బంగారం గాను... చిన్నప్పటి నుండి ఇన్ని తెలివితేటలా సార్.. వావ్" అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు.
ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించి కేవలం లక్ష్మీ పార్వతి కోణంలోనే సినిమా తీస్తే ప్రజలు ఒప్పుకోరని సోమిరెడ్డి చెప్పగా, " ఓహ్ సార్... ఈ మాట కోట్ల ప్రజలు ట్రైన్లలో, బస్సుల్లో మీ ఇంటికొచ్చి మీ చెవిలో చెప్పారా సార్? సో వండర్ ఫుల్... వాంట్ టూ సో కిస్ యూ" అన్నారు. ఇక వర్మ తీసే సినిమా గురించి తాము భయపడటం లేదన్న మాటలకు, "భయపడనప్పుడు ఇంత అరవాల్సిన అవసరం ఏముంది రెడ్డి గారు? కేవలం అడుగుతున్నా? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఉందంటారా?" అని అడిగాడు.
ఇక, రాజకీయ ప్రయోజనాలు లేకుండా వాస్తవం తీయమని చెబుతున్నానన్న సలహాకు,. "అబ్బబ్బో మీకు నాకన్నా ఎక్కువ వాస్తవాలు తెలుసని మీరు అంటుంటే ఆ రోజుల్లో తలుపెనక నక్కి ఉండేవారా? లేక మంచం కింద దాక్కునేవారా? చెప్పండి ప్లీజ్ ..మేము మీ గాసిప్ కోసం తహతహలాడిపోతున్నాము" అన్నాడు. టీవీ9 చానల్ లో ఓపెన్ డిబేట్ కు రావాలని వర్మ మంత్రికి సవాల్ విసిరాడు.