jagan: జగన్ కు ఊరటా? చుక్కెెదురా?.. నేడు కోర్టు నిర్ణయం!
- పాదయాత్ర చేపట్టనున్న వైఎస్ జగన్
- ప్రతి వారమూ కోర్టుకు రాలేనని వెల్లడి
- నేడు నిర్ణయం తీసుకోనున్న సీబీఐ కోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్న తాను, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సుదీర్ఘ పాదయాత్రను చేబడుతున్నానని, ఈ కారణంగా ప్రతి శుక్రవారమూ కోర్టు విచారణకు రాలేనని కోరుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పెట్టుకున్న పిటిషన్ నేడు విచారణకు రానుండగా, కోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఈ విషయంలో తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ కోర్టులోనే విన్నవించుకోవాలని హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఆపై జగన్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన స్పెషల్ కోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ కౌంటర్ సైతం నేడు కోర్టుకు చేరనుంది.
ఈ నేపథ్యంలో పాదయాత్ర చేసేందుకు ఊరట లభిస్తుందా? లేదా? అన్న విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, తాను నవంబర్ 2 నుంచి పాదయాత్రను చేపట్టనున్నానని, ఇడుపులపాయ నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి, అక్కడి నుంచి అన్ని జిల్లాలనూ తాకుతూ యాత్ర సాగుతుందని ఇప్పటికే జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.