sucide: ముందే చెప్పి మరీ ప్రాణాలు తీసుకుంటున్న యువత... ఈ విషయంలో ముందున్న హైదరాబాదీలు!
- చనిపోతున్నామని ముందే చెబుతున్న యువతీ యువకులు
- సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ ఆత్మహత్య
- పోస్టు పెట్టేందుకు వాడినంత సమయమైనా ఆత్మహత్యపై ఆలోచించడం లేదు
- అన్ని సమస్యలకూ చావు పరిష్కారం కాదంటున్న మానసిక నిపుణులు
ఏవో కొన్ని కారణాలను చూసి ఆందోళనతోనో, భయపడో యువత ఆత్మహత్యలు చేసుకోవడం, ఆపై తమను నమ్మినవారిని, తమపై ఆధారపడ్డ వారిని అనాధలుగా చేసి వారికి జీవితాంతం బాధను మిగల్చడం తెలిసిందే. కానీ, ఇటీవలి కాలంలో ముందే చెప్పుకుని మరీ ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. తాము మరణించాలని భావించి, ఆ విషయాన్ని తెలిసిన వారికి, తెలియని వారికి కూడా చెబుతూ నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఈ విషయంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాదీలు ముందుంటున్నారు.
ఒక్క రోజు వ్యవధిలో తాము మరణిస్తున్నామని సోషల్ మీడియాలో చెప్పి ప్రాణాలు తీసుకున్న మూడు ఘటనలు నగరంలో కలకలం రేపాయి. ఇంజనీరింగ్ చదువుతున్న 21 సంవత్సరాల మౌనిక, తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడుతూ, "సంతోషంగా ఉండాలంటే భయంగా ఉంది" అని తన స్టేటస్ ను మార్చి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇక మరో ఘటనలో ఓ యువకుడు, తనను డబ్బు కోసం ఇంట్లో వాళ్లే వేధిస్తున్నారని, తలకు ఉరి బిగించుకుని వీడియో రికార్డు చేసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఘటనలో ఇంటర్ చదువుతున్న సంయుక్త, నీట్ లో సీటు కోసం ఇంట్లోని వారు చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. ఈ అమ్మాయి కూడా తన మరణం గురించి ముందే చెప్పింది.
ఇక తమ ప్రాణాలను తీసుకోవాలని భావించేవారు ఎంతో కృత నిశ్చయంతో ఉంటున్నారని, అందువల్ల ముందే అందరికీ చెప్పి ఆ పని చేయగలుగుతున్నారని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత, ఆ విషయం నలుగురికీ చెప్పాలని అనుకునేంత సేపు, ఆత్మహత్య ఎందుకని ఆలోచించి, సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తే, ఈ తరహా ఘటనలు తగ్గుతాయని అంటున్నారు. ఇక చాలా సందర్భాల్లో తమ మిత్రుడు ప్రాణాలు తీసుకుంటున్నాడని తెలిసిన తరువాత, వారు స్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని అంటున్నారు.