EMERALD STARS: పసిఫిక్ సముద్రంలో మునిగిన సరుకు రవాణా నౌక.. 11 మంది భారతీయ సిబ్బంది గల్లంతు
- సహాయక చర్యలకు టైఫూన్ అంతరాయం
- మునిగిన ‘ఎమరాల్డ్ స్టార్స్’
- ఫిలిప్పైన్స్ నుంచి వెళ్తుండగా ఘటన
26 మంది భారతీయ సిబ్బందితో వెళ్తున్న కార్గో నౌక ‘ఎమరాల్డ్ స్టార్స్’ శుక్రవారం పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 11 మంది భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు. నౌక ఫిలిప్పైన్స్ ఉత్తర దిశ నుంచి తూర్పు వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీరానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నౌక ప్రమాదంలో పడినట్టు తమకు సంకేతాలు అందాయని జపాన్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. ఇదే ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న మూడు నౌకలు ఎమరాల్డ్ స్టార్స్ నౌకలోని 15 మందిని కాపాడగా మిగతా వారు అదృశ్యమయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి మూడు విమానాలు, రెండు గస్తీ పడవలతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినప్పటికీ నౌకను కాపాడలేకపోయాయి. దీంతో 33.205 టన్నుల నౌక మునిగిపోయింది. టైఫూన్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.