amaravati: నాలుగు రోజులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న అమరావతి రైతులు!
- 123 మందిని ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మెలకువలు నేర్చుకోనున్న రైతులు
- టికెట్ ఖర్చులు రైతులవే
రాజధాని నిర్మాణం కోసం 35వేల ఎకరాలకి పైగా భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసిన 25వేల మంది రైతుల్లో కొంతమందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ పర్యటనకు తీసుకెళ్లనుంది. వారిలో 123 మందిని ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసింది. నాలుగు రోజుల ఈ పర్యటనలో భాగంగా రాజధాని నిర్మాణంపై అవగాహనతో పాటు బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో వారికి మెలకువలు నేర్పనున్నట్లు తెలుస్తోంది. వీరందరినీ మూడు బ్యాచ్‌లుగా సింగపూర్ పంపనున్నారు. అక్టోబర్ 30న రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి పి. నారాయణ, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ) మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మొదటి బ్యాచ్‌ను పంపించనున్నారు. నవంబర్ చివరి వారంలో చివరి బ్యాచ్ ప్రయాణం జరిగేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
అయితే ఈ పర్యటన పూర్తిగా ఉచితం కాదు. సింగపూర్ వెళ్లాక అక్కడి వసతులు, తిండి, పర్యటనల ఖర్చులను ఏపీసీఆర్డీఏ చూసుకోనుంది. ఇందుకోసం ఒక్కో రైతుకు రూ. 30000లు ఖర్చు చేయనుంది. ఇక విమాన టిక్కెట్లు, వీసా, ఇన్స్యూరెన్స్ వంటి ఖర్చులన్నీ రైతులే భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారికి ఒక్కొక్కరికి రూ. 25000లు ఖర్చయ్యే అవకాశం ఉంది.
`ఇది ఒకవేళ ఉచిత పర్యటన అయ్యుంటే మొత్తం 25 వేల మంది రైతులు ముందుకొచ్చేవారు. అప్పుడు రాష్ట్ర ఖజానా మీద కోలుకోలేని భారం పడేది` అని ఏపీసీఆర్డీఏ మీడియా సలహాదారు ఎ. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అయితే రాజధాని నిర్మాణం విషయాన్ని పక్కదోవ పట్టించడానికే ప్రభుత్వం ఇలాంటి పర్యటనలు ప్లాన్ చేస్తోందని ప్రతిపక్షం ఆరోపించింది.