Minister: కలెక్టర్ ఆమ్రపాలిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. డోంట్ ఆర్గ్యూ అంటూ అసహనం!

  • నిధులిస్తున్నా పనులు జరగడం లేదని అసంతృప్తి
  • ముఖ్యమంత్రి హామీలకే దిక్కులేకుంటే ఎలా? అని ఆవేదన
  • 24న అందరూ హైదరాబాద్ రావాలని ఆదేశం

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిపై తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నిర్లక్ష్యంపై మందలించారు. ప్రభుత్వం నిధులిస్తున్నా పనులు ఎందుకు చేయడం లేదంటూ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, మేయర్, ఎమ్మెల్యేలను నిలదీశారు.  

శనివారం వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌లో నిర్వహించిన నగర పాలక  సంస్థ సమీక్షా సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ నగర ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారని, వాటి ప్రతిపాదనలెక్కడని ప్రశ్నించారు. ఇంత దారుణంగా ఎలా పనిచేస్తున్నారని, ప్రజలకు ఏమని  సమాధానం చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కులేకుంటే ఎలా అని మండిపడ్డారు.

ఈ పరిస్థితుల్లో తాను రివ్యూ కొనసాగించలేనని, ఈనెల 24న సాయంత్రం అందరూ హైదరాబాద్‌లో సమావేశానికి రావాలని మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే వినయ్‌ను ఉద్దేశించి.. ‘నిధులు ఇస్తాం, లక్ష్యాలు ఇస్తాం.. ఇంకేం చేయాలి? ముఖ్యమంత్రి వచ్చి అన్నం కలిపి ముద్ద నోట్లో పెట్టాలా?’ అని అన్నారు. అధికారులనైతే బదిలీ చేస్తే వేరే ప్రాంతానికి వెళ్లిపోతారని, కానీ ప్రజాప్రతినిధులు ఏమని సమాధానం చెబుతారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించడంతో అందరూ సైలెంటైపోయారు.
 
 ఒకదశలో కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘డోంట్ ఆర్గ్యూ ఆమ్రపాలీ’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తుంటే ఇక్కడ జరుగుతున్నది వేరని అన్నారు. స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాల విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని మంత్రి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News