Mogadishu: మొగదిషులో మారణహోమం.. 231 మంది దుర్మరణం!
- సోమాలియా రాజధాని రక్తసిక్తం
- ట్రక్కు బాంబుతో విరుచుకుపడిన ఉగ్రవాదులు
- ఆఫ్రికా దేశాల్లోనే కనీవినీ ఎరుగని ఘటన
సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఆఫ్రికా దేశాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేశారు. ఏకంగా 231 మంది ప్రాణాలను బలిగొన్నారు. శనివారం ఓ రద్దీ ప్రాంతంలో పేలిన ట్రక్కు బాంబు దాడిలో మరణించిన వారి సంఖ్య 231కి చేరుకుంది. పరిస్థితులను బట్టి చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 275 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అల్‌ఖాయిదా అనుబంధ ఉగ్రవాధ సంస్థ ‘అల్-షబాబ్’ ఈ దాడికి పాల్పడినట్టు ప్రభుత్వ అనుమానిస్తోంది.
నిత్యం రద్దీగా ఉండే కె-5 కూడలిలోని సఫారీ బయట ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన ట్రక్కుతో దాడి చేశారు. శక్తిమంతమైన ఈ పేలుడుకు సమీపంలోని భవనాలు తునాతునకలయ్యాయి. ప్రజల శరీరాలు ఛిద్రమై ఎగిరిపడ్డాయి. మృతదేహాలు కాలి గుర్తుపట్ట లేనంతగా మారిపోయాయి. రక్తమోడుతున్న శరీరాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది.
క్షతగాత్రులు, మృతదేహాలతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. బంధువుల రోదనలతో మారుమోగుతున్నాయి. పేలుడు ధాటికి కూలిన భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉండే అవకాశం ఉండడంతో రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. బాంబు దాడిపై అధ్యక్షుడు మహ్మద్ అబ్బుల్లాహి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ట్రక్కు బాంబు దాడి జరిగిన రెండు గంటల వ్యవధిలో మెదీనా జిల్లాలోనూ ఓ పేలుడు జరిగింది. అయితే ఎంతమంది మృతి చెందారనే విషయం తెలియరాలేదు.