Madhu sudanachary: తెలంగాణ స్పీకర్‌పై కేసీఆర్‌కు లేఖ.. ఎన్నికల బాకీ రూ.48.23 లక్షలు ఇప్పించాలని కోరిన పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్!
- లేఖతో సంచలనం సృష్టించిన శ్రీనివాసరెడ్డి
- తన డబ్బులు తనకు ఇప్పించాల్సిందిగా సీఎంకు వేడుకోలు
- శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మండలపార్టీ అధ్యక్షుడు
తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలపెల్లి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో మధుసూదనాచారి తరపున రూ.98.58 లక్షలు ఖర్చు చేశానని, ఆయన తనకు రూ.50.35 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బులు ఇప్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీనివాసరెడ్డి లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది. ముఖ్యమంత్రికి లేఖ రాయడంతోపాటు ఫేస్‌బుక్‌లోనూ వీడియో పోస్ట్ చేసి కలకలం రేపారు.
కేసీఆర్‌కు రాసిన లేఖలో మధుసూదనాచారి తనకు బాకీ పడిన సొమ్ముకు సంబంధించిన లెక్కలను స్పష్టంగా పొందుపరిచారు. అలాగే తనకు ఉన్న భూమినంతా అమ్మేసి 17 ఏళ్లుగా మధుసూదన్ కోసం ఖర్చు చేశానని అందులో కోరారు. గతంలో జరిగిన సింగరేణి ఎన్నికల్లో భూపాలపల్లిలో ఓటమికి స్పీకర్ కుమారులే కారణమని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రతీ పనికి వారు డబ్బులు వసూలు చేస్తున్నారని, కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు.
ట్రాక్టర్ల పథకం, ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, రూ.10వేలు చొప్పున కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. వారి వల్ల నియోజకవర్గంలో పార్టీ తీవ్రంగా దెబ్బతిందన్నారు. నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. అవినీతిపై విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎంను వేడుకున్నారు. కాగా, శ్రీనివాసరెడ్డి ఓర్వలేకే స్పీకర్‌పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు శాయంపేట మండల పార్టీ అధ్యక్షుడు గుర్రం రవీందర్ తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా పార్టీ అధిష్ఠానానికి సిఫారసు చేసినట్టు పేర్కొన్నారు.