pakistan: పాక్ ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం.. మాజీ ప్రధాని షరీఫ్ అల్లుడు సహా 261 మందిపై సస్పెన్షన్!
- ఆస్తులు వెల్లడించని చట్టసభ్యులపై కొరడా
- సస్పెన్షన్‌కు గురైన వారిలో జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు
- ఆస్తుల వివరాలు వెల్లడించే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్న ఈసీపీ
పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ (ఈసీపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 42 ఎ ప్రకారం ఆస్తులు వెల్లడించని 261 మంది చట్ట సభ్యులను సస్పెండ్ చేసింది. వీరిలో జాతీయ అసెంబ్లీ, సెనేట్, పలు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఉన్నారు. అంతేకాదు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ఈసీపీ నోటీఫికేషన్ ప్రకారం.. ఏడుగురు సెనేటర్లు, 71 మంది జాతీయ అసెంబ్లీ సభ్యులు, పంజాబ్ అసెంబ్లీకి చెందిన 84 మంది, సింధ్ అసెంబ్లీకి చెందిన 50 మంది, 38 మంది ఖైబర్-పక్తుంఖ్వా ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు, బలూచిస్థాన్‌కు చెందిన 11 మంది చట్ట సభ్యులు ఉన్నారు. సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని, ఆస్తుల వివరాలు వెల్లడించే వరకు ఇది కొనసాగుతుందని ఈసీపీ స్పష్టం చేసింది.
సస్పెన్షన్‌కు గురైన వారిలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అల్లుడు ముహమ్మద్ సఫ్దర్, హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖా మంత్రి తలాల్ చౌదరి, మత వ్యవహారాల శాఖామంత్రి సర్దార్ యూసఫ్, జాతీయ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఫెమీదా మీర్జా తదితరులు ఉన్నారు. కాగా, గతేడాది కూడా ఆస్తులు వెల్లడించని 336 మంది చట్ట సభ్యులను ఈసీపీ సస్పెండ్ చేసింది.