GST: ఏసీ రెస్టారెంట్ కు వెళుతున్నారా?.. అయితే మీకో శుభవార్త!
- 18 నుంచి 12 శాతానికి తగ్గనున్న జీఎస్టీ
- కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం
- 9న గౌహతిలో సమావేశం తరువాత ప్రకటించే అవకాశం
తరచూ ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్లకు వెళ్లే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను వినిపించనుంది. ప్రస్తుతం ఏసీ రెస్టారెంట్లపై 18 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను విధిస్తుండగా, దాన్ని 12 శాతానికి తగ్గిస్తూ త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాన్ ఏసీ రెస్టారెంట్లపై 12 శాతం జీఎస్టీ ఉండగా, ఏసీ రెస్టారెంట్లలోనూ ఇదే శ్లాబ్ ను వర్తింప జేసేలా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం పరిశీలిస్తోందని, త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఓ అధికారి తెలిపారు.
పన్ను రాయితీలతో కూడిన 12 శాతం జీఎస్టీ విధించాలా? లేక పన్ను రాయితీలు తీసేయాలా? అన్న విషయమై చర్చ సాగుతోందని అన్నారు. కాగా, ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్ లో మాత్రం 18 శాతం జీఎస్టీ అమలవుతుందని తెలుస్తోంది. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వచ్చే నెల 9వ తేదీన గువహటిలో జరగనుండగా, అక్కడ రెస్టారెంట్ల శ్లాబ్ మార్పు నిర్ణయంపై ఓ ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఇక రెస్టారెంట్లు తామిచ్చిన ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తున్నాయా? లేదా? అన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పరిశీలించనున్నారు.