Russia: సంచలన విషయం వెల్లడి.. తాలిబన్లకు నిధులు సమకూరుస్తున్న రష్యా
- నాటో దళాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు తాలిబన్లకు నిధులు
- చమురు సరఫరా ద్వారా నిధులు సమకూరుస్తున్న రష్యా
- తొలిసారి బహిరంగంగా వెల్లడించిన తాలిబన్లు
రష్యాకు సంబంధించిన సంచలన విషయం ఒకటి బయటపడింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని నాటో దళాలు నిర్వహిస్తున్న ఆపరేషన్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు తాలిబన్లకు రష్యా నిధులు సమకూరుస్తున్నట్టు తెలిసింది. తాలిబన్లకు రష్యా చమురును సరఫరా చేస్తుండగా దానిని అమ్మడం ద్వారా తాలిబన్లు నెలకు రూ.16 కోట్లు సమకూర్చుకుంటున్నారు. ఆ నిధులను నాటో ఆపరేషన్స్‌కు వ్యతిరేకంగా వాడుతున్నట్టు తాలిబన్ సభ్యుడొకరు తెలిపారు. మూడు లక్ష్యాలే ధ్యేయంగా రష్యా తమతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. అందులో మొదటిది ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించడం, రెండోది ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని అణగదొక్కడం, మూడోది నాటో దళాలకు వ్యతిరేకంగా పోరాడడమని ఆయన వివరించారు.
రష్యా పంపిస్తున్న ఆయిల్ ట్యాంకర్లు ఉజ్బెకిస్థాన్ సరిహద్దు మీదుగా ఆఫ్ఘనిస్థాన్ చేరుకుంటున్నాయి. 18 నెలల క్రితమే ఇది ప్రారంభమైందని తాలిబన్ సభ్యుడు తెలిపాడు. రష్యా తమకు సాయం అందిస్తున్నట్టు తాలిబన్లు బహిరంగంగా ప్రకటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో నాటో సభ్యదేశాలకు చెందిన 13వేల బలగాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.