food: ఆహారం మిగిలిపోయిందా?.... ఆన్లైన్లో దానం చేయండి!
- వెబ్‌పోర్టల్ ప్రారంభించిన ప్రభుత్వం
- ఆవిష్కరించిన కేంద్రమంత్రి అశ్వనిచౌబే
- ఆకలితో అలమటించే వారికి సాయం
రోజూ ఇంట్లో ఎంతో కొంత ఆహారం మిగిలిపోతుంటుంది...అలాగే పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో కూడా చాలా వంటకాలు మిగిలిపోతుంటాయి. ఇలా ఆహార పదార్థాల వృథాను అడ్డుకోవడానికి కేంద్రం ఓ ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ ద్వారా మిగిలిపోయిన ఆహారాన్ని అవసరం ఉన్న వారికి దానం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
www.ifra.org.in ద్వారా ఈ సదుపాయాన్ని కల్పించింది. ఇందులో మిగిలిపోయిన ఆహార పదార్థాల వివరాలను నమోదు చేస్తే, ఫుడ్ రికవరీ ఏజెన్సీ వారు వచ్చి తీసుకెళ్తారు. తర్వాత వారు ఆకలితో అలమటిస్తున్న వారికి అందజేస్తారు. ఆహారం దానం చేయాలనుకునేవారు, స్వచ్ఛంద సేవకులు కూడా ఈ పోర్టల్ ద్వారా ఆహారం దానం చేయవచ్చు. అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. దీన్ని కేంద్రమంత్రి అశ్వనిచౌబే ఆవిష్కరించారు.