sagar: శ్రీశైలానికి అకస్మాత్తుగా పెరిగిన వరద... మరో గేటు ఎత్తివేత
- 2 లక్షల క్యూసెక్కులు దాటిన వరద నీరు
- 562 అడుగులకు పెరిగిన సాగర్ నీటిమట్టం
- మరో నాలుగు రోజుల వరదతో నిండుకుండే
కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి ప్రవహిస్తున్న వరద ఒక్కసారిగా పెరిగింది. దీంతో నిన్న సాయంత్రానికి 1.25 లక్షల క్యూసెక్కులుగా ఉన్న శ్రీశైలం ఇన్ ఫ్లో, ఈ ఉదయానికి దాదాపు 2 లక్షల క్యూసెక్కులను తాకింది. నారాయణపూర్, జూరాల, ఆల్మట్టి, తుంగభద్ర నుంచి ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యామ్ మరో గేటును కూడా పది అడుగుల మేరకు ఎత్తారు. మొత్తం 8 గేట్లను ఎత్తి, వాటి ద్వారా 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు వదులుతున్నారు.
మరోవైపు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 60 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. 590 అడుగుల లోతున్న సాగర్ జలాశయంలో ప్రస్తుతం 562 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులో 236 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఇదే వరద ప్రవాహం మరో మూడు, నాలుగు రోజులు కొనసాగితే సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ స్థితికి చేరుతుందని వెల్లడించారు. ఇదిలావుండగా, అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు యోగివేమన ప్రాజెక్టు నిండుకుండగా మారడంతో చిత్రావతి నీటిని దిగువకు వదులుతున్నారు.