sharin mathews: టెక్సాస్ లో 10 రోజుల క్రితం తప్పిపోయిన మూడేళ్ల భారత చిన్నారి... వేటకై కదిలిన అసంఖ్యాక నెటిజన్లు!
- ఈనెల 7న తప్పిపోయిన బాలిక
- తండ్రి కాఠిన్యానికి బలి
- పాలు తాగలేదని బయట నిలబెట్టిన తండ్రి
- పావుగంటలోనే పాప మాయం!
షరిన్ మ్యాథ్యూ... అక్టోబర్ 7న పెంపుడు తండ్రి వెస్లీ మ్యాథ్యూస్ కాఠిన్యానికి బలైన భారత సంతతి బాలిక. పట్టుమని మూడేళ్లు కూడా నిండని వయసులో, తెలిసీ తెలియక పాలు తాగనని మారాం చేసినందుకు నిర్దయగా తండ్రి భయట నిలబెట్టగా, ఎటో వెళ్లిపోయిన చిన్నారి. తెల్లవారుఝామున 3 గంటలకు తన కుమార్తెకు భయం చెప్పాలన్న ఉద్దేశంతో బయట నిలబడాలని ఆదేశించానని, ఆపై పావుగంటలోనే ఆమె మాయం అయిందని వెస్లీ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు గడిచినా కేసు ఓ కొలిక్కి రాకపోవడం, షరీన్ ఆచూకీపై ఒక్క చిన్న క్లూ కూడా పోలీసులకు దొరకక పోవడంతో మరిన్ని బృందాలను రంగంలోకి దించారు.
ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలనన్నింటినీ చెక్ చేస్తున్నా ఏ విధమైన సమాచారం లభించలేదని తెలుస్తోంది. ఇక ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్న టెక్సాస్, రిజర్డ్ సన్ పోలీస్ విభాగం, పాపను కనుగొనేందుకు సహకరించాలని ప్రజలను కోరుతోంది. తమ డిటెక్టివ్ లు షరిన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారని, విచారణ కొనసాగుతోందని, నెటిజన్లు తమ వంతు ప్రయత్నాలు చేయాలని పోలీసులు ఓ ప్రకటనలో కోరారు. ఇక షరీన్ కుటుంబం, ఆ పాప వీడియోలు, ఫొటోలను పోస్టు చేస్తూ, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కేసులో తొలుత మ్యాథ్యూను అరెస్ట్ చేసిన పోలీసులు, అభియోగాలు మోపిన తరువాత విడుదల చేశారు.