delhi: ఒక్క పటాసు పేలకుండానే అత్యంత ప్రమాదకర స్థాయికి ఢిల్లీ వాతావరణం... జనరేటర్ల వాడకంపై నిషేధం!
- వస్తూనే వాతావరణాన్ని ప్రభావితం చేసిన చలిగాలులు
- కాలుష్యం, పొగతో నిండిపోయిన దేశ రాజధాని
- మరోసారి సరి-బేసి విధానం, కార్ పూలింగ్!
- కీలక నిర్ణయాలు ప్రకటించనున్న అధికార యంత్రాంగం
చలికాలం ప్రవేశిస్తూనే ఢిల్లీ వాతావరణంలో పెను మార్పులను తెచ్చింది. పొగమంచు మహానగరాన్ని కమ్మేయగా, గాలిలో స్వచ్ఛత కనిష్ఠానికి పడిపోయింది. ఒక్క దీపావళి టపాకాయ కూడా పేలకుండానే ప్రమాదకర స్థాయికి గాలి చేరింది. ఇక పరిస్థితి మరింత విషమించకుండా చూసేందుకు రంగంలోకి దిగిన మునిసిపల్ అధికారులు జనరేటర్ల వాడకంపై నిషేధాన్ని ప్రకటించారు.
మార్చి 15వ తేదీ వరకూ పొగమంచు కొనసాగే అవకాశాలు ఉండటంతో కార్ పూలింగ్, సరి-బేసి విధానం వంటి నిర్ణయాలు కూడా తెరపైకి రానున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ లో సాధారణ స్థాయికంటే, 14 నుంచి 16 రెట్ల అధిక కాలుష్యం నమోదు కాగా, ఈ సంవత్సరం అంతకు మించిన కాలుష్యం నమోదవుతుందని ఈపీసీఏ (ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ (ప్రివెన్షన్) అండ్ కంట్రోల్ అథారిటీ అంచనా వేస్తోంది.
మొత్తం 30 ప్రాంతాల్లో కాలుష్య పరిశీలనా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా నిత్యమూ గణాంకాలు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఓ అధికారి వెల్లడించారు. ఇక కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే దీపావళి మందుగుండు సామగ్రి అమ్మకాలను నిలిపివేసిన పోలీసులు, సాధ్యమైనంత తక్కువగానే టపాకాయలు పేలేట్టు చూస్తామని చెబుతున్నారు.