trumph: ట్రంప్ కు షాక్ ఇచ్చిన జడ్జి... అధ్యక్షుడి ఆదేశాలపై మరోసారి స్టే!
- ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా, ఉత్తరకొరియా, వెనిజులా దేశాల ప్రజలపై నిషేధం విధించిన ట్రంప్
- ట్రంప్ కు ఆ హక్కు లేదన్న హవాయి న్యాయవాదులు
- హవాయి న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన జడ్జి డెరిక్ వాట్సన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు హవాయి ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జీ డెరిక్ వాట్సన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆరు దేశాలకు చెందిన వారు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అయితే అలా ఇతర దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించే హక్కు అధ్యక్షుడికి లేదని హవాయి ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జీ డెరిక్ వాట్సన్ స్పష్టం చేశారు. మరో వారంలో ట్రంప్ ఆదేశాలు అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దాని వివరాల్లోకి వెళ్తే... సెప్టెంబర్ లో ట్రంప్ ఆరు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా తన విశేష అధికారాలు ఉపయోగించి ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆదేశాలపై హవాయి రాష్ట్రం కోర్టును ఆశ్రయించింది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను మార్చే హక్కు అధ్యక్షుడికి లేదని, ట్రంప్ ప్రతిపాదించిన నిషేధాన్ని నిలుపుదల చేయాని హవాయి స్టేట్ తన వ్యాజ్యంలో న్యాయస్థానాన్ని కోరింది.
దీంతో హవాయి రాష్ట్ర న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా దేశాల పౌరులతో పాటు ఉత్తరకొరియా, వెనిజులా అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా తీసుకొచ్చిన నిషేధాన్ని నిలిపేయాలని ఆదేశించింది.
కాగా, గత మార్చినెలలో ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త మార్పులతో ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను తీసుకొచ్చారు. అయితే దానిని కూడా యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జీ డెరిక్ వాట్సన్ నిలిపేయాలని మరోసారి ఆదేశించారు. ట్రావెల్ బ్యాన్ ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. తాజాగా వెలువడిన తీర్పు నేపథ్యంలో ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. దీంతో ట్రంప్ కు న్యాయస్థానం మరోసారి మొట్టికాయలు వేసినట్టైంది.