serial: హిందీ సీరియల్‌కి ఫిదా అయిన ఘనా ఆటగాళ్లు... నటీనటులను కలిసేందుకు ప్రయత్నం
- `కుమ్కుమ్ భాగ్య` సీరియల్‌ని ఇష్టపడుతున్న ఘనా ఫుట్‌బాల్ ఆటగాళ్లు
- ముంబైలో మ్యాచ్ అనగానే ఎగిరి గంతేసిన వైనం
- దీపావళి సందర్భంగా అందుబాటులో లేని నటీనటులు
ఒక భాషలో సీరియళ్లు మరో భాషలో అనువాదమై, హిట్ కావడం చూస్తూనే ఉన్నాం. జీ టీవీలో ప్రసారమయ్యే `కుమ్కుమ్ భాగ్య` సీరియల్ కూడా వివిధ భాషల్లోకి అనువాదమైంది. అనువాదమైన అన్ని భాషల్లోనూ ఆ సీరియల్ హిట్. ఇదే సీరియల్ ఘనా దేశంలో కూడా వారి `ట్వి` భాషలో ప్రసారమవుతోంది. అక్కడ కూడా ఈ సీరియల్ చాలా పాప్యులర్. ఎంతెలా అంటే.. అండర్ 17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ప్రీక్వార్టర్స్ కోసం ముంబైకి చేరుకున్నాక, అక్కడ తాము చేయాల్సిన పనుల్లో ఈ సీరియల్ నటీనటులను కలవడం మొదటి పనిగా పెట్టుకున్నారట.
నటీనటుల ఆటోగ్రాఫ్‌లు తీసుకుని, ఫొటోలు దిగి, ఓ ఐదు నిమిషాలు ముచ్చటించాలని ఆటగాళ్లు కోరుకుంటున్నారని ఘనా ఫుట్‌బాల్ బోర్డు చైర్మన్ క్వాడ్వో అగ్యేమాంగ్ తెలిపారు. ఇప్పటికే మిస్సయిన ఎపిసోడ్లను ఫోన్లలో చూసేందుకు ప్రయత్నిస్తున్నారని, సీరియల్ గొడవలో పడి ఆట మీద ఏకాగ్రత తగ్గకుండా ఉండేందుకు వారి ఫోన్లను లాక్కున్నానని, తాను కూడా ఈ సీరియల్‌కి పెద్ద అభిమానినని అగ్యేమాంగ్ చెప్పుకొచ్చాడు.
2015 నుంచి `కుమ్కుమ్ భాగ్య` సీరియల్ ఘనాలో ప్రసారమవుతోంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉండే హిందీ సీరియళ్లను అక్కడి వాళ్లు ఎంతగానో ఆదరిస్తారు. అక్కడి విద్యార్థుల పరీక్ష పత్రాల్లో కూడా సీరియళ్లకు సంబంధించిన ప్రశ్నలు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి.