north korea: కిమ్ జాంగ్ కు అనుకూలంగా పని చేస్తున్న భారత హ్యాకర్లు
- దక్షిణ కొరియాపై సైబర్ దాడులు
- ఐదో వంతు దాడులు భారత్ నుంచే
- వివరాలను వెల్లడించిన న్యూయార్క్ టైమ్స్, రికార్డెడ్ ఫ్యూచర్
అమెరికాను బుగ్గి చేస్తామంటూ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్న ఉత్తర కొరియా... సైబర్ దాడులతో దక్షిణ కొరియాను బెంబేలెత్తిస్తోంది. అయితే, తన సొంతగడ్డపై నుంచి పరిమిత స్థాయిలోనే ఈ దాడులను చేస్తోంది. ఇతర దేశాల్లోని హ్యాకర్లను ఉపయోగించుకుని భారీ దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా ఉత్తర కొరియా వినియోగించుకుంటున్న విదేశీ హ్యాకర్లలో భారతీయులు కూడా ఉన్నారంటూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర కొరియా చేస్తున్న సైబర్ దాడుల్లో ఐదో వంతు దాడులు భారత్ కేంద్రంగానే జరుగుతున్నాయని 'రికార్డెడ్ ఫ్యూచర్' అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. భారత్-ఉత్తరకొరియాల మధ్య పలు అంశాల్లో సంబంధాలు ఉన్నాయని... భారత్ లోని ఏడు యూనివర్శిటీల్లో ఉత్తర కొరియా విద్యార్థులు చదువుకుంటున్నారని వెల్లడించింది. అయితే, ఈ విషయంలో భారత్ కు ఎలాంటి దురుద్దేశాలు ఉండకపోవచ్చని పేర్కొంది.
వాస్తవానికి ఉత్తర కొరియాతో భారత్ కు మంచి సంబంధాలే ఉండేవి. కిమ్ జాంగ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇరు దేశాల మధ్య గ్యాప్ కొంచెం పెరిగింది. అమెరికాతో సంబంధాలు బలపడే కొద్దీ... ఉత్తర కొరియాను భారత్ దూరం పెడుతూ వస్తోంది. మరోవైపు, ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను కూడా ఇటీవల మోదీ ప్రభుత్వం సమర్థించింది.