China: చైనా-పాక్ స్నేహంపై బెంగళూరు వర్తకుల ఆగ్రహం.. చైనా ఫ్రూట్స్‌కు చెక్!
- బెంగళూరు వర్తకుల సంచలన నిర్ణయం
- చైనా యాపిల్స్ దిగుమతికి నో
- గతేడాదితో పోలిస్తే 70 శాతానికిపైగా తగ్గిన దిగుమతి
చైనా నుంచి దిగుమతి అవుతున్న ఆపిల్స్, డ్రాగన్ ఫ్రూట్స్‌ను ఇకపై దేశంలోకి దిగుమతి చేసుకోరాదని కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని బెళగావి పండ్ల వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా మారిన పాకిస్థాన్‌తో చైనా చెలిమిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వీరు ఆ దేశం నుంచి ఎటువంటి పండ్లను దిగుమతి చేసుకోరాదని ప్రతిన బూనారు. కర్ణాటకలోని అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన బెళగావికి చైనా నుంచి రోజూ 200 టన్నులకుపైగా వివిధ రకాల పండ్లు దిగుమతి అవుతున్నాయి.
ఇటీవల డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో చైనా వస్తువులపై ప్రజలు కన్నెర్ర చేశారు. చైనా నుంచి దిగుమతి అయ్యే ఎటువంటి వస్తువులను కొనుగోలు చేయరాదని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. చైనా నుంచి దిగుమతి అవుతున్న పండ్లపైనా దీని ప్రభావం పడింది. చైనా ఆపిల్స్ కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో వాటి దిగుమతిని తగ్గించేసినట్టు వర్తకుల సంఘం ప్రతినిధి షానబాజ్ తెలిపారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుమతి 70 శాతానికి పైగా తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. చైనా ఆపిల్స్, ఇతర పండ్లను కొనేందుకు వినియోగదారులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో కశ్మీర్, సిమ్లాల నుంచి పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్టు ఆయన వివరించారు.