thief: ఈ దొంగ మామూలోడు కాదు...ముఖం మార్చుకుని... 120 కార్లు దొంగిలించాడు!
- 50 కార్లను దొంగిలించిన తరువాత పోలీసులకు పట్టుబడ్డ తనూజ్
- బెయిల్ పై విడుదలై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని కునాల్ మహేశ్వర్ గా మారిన వైనం
- ప్లాస్టిక్ సర్జరీ అనంతరం 70 కార్ల చోరీ
ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ తరహాలో గతంలో దొంగతనానికి పాల్పడిన ఆ ప్రాంతంలోని దొంగలందర్నీ విచారించి పోలీసులు కేసును చాకచక్యంగా ఛేదిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల ఎత్తుకు పై ఎత్తులు వేసిన హైటెక్ దొంగ ఏకంగా 120 కార్లను కొట్టేశాడు.
దాని వివరాల్లోకి వెళ్తే...ఢిల్లీలోని చిరువ్యాపారి కుమారుడైన తనూజ్ 12వ తరగతి వరకు చదువుకున్నాడు. పదోతరగతిలో (16వ ఏట) ఉండగానే మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. దీంతో డబ్బుల కోసం కార్ల దొంగతనాలు ప్రారంభించాడు. అలా దొంగిలించిన కార్లలో గర్ల్ ఫ్రెండ్స్ తో షికారుకెళ్లడం అతనికి సరదా... అలా అప్పుడప్పుడు అవసరాలకోసం చేసిన దొంగతనాలను తరువాతి కాలంలో పూర్తిస్థాయి వృత్తిగా స్వీకరించాడు.
ఆ తరువాత కార్లు దొంగిలించే భారీ ముఠాతో సంబంధాలు ఏర్పర్చుకుని ఇంజిన్, ఛాసీస్ నంబర్లను మార్చి విక్రయించాడు చేది. ఇలా సుమారు 50 కార్లు దొంగతనం చేసిన తరువాత 2013లో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అప్పుడు అతనిని అరెస్టు చేసిన పోలీసులు, అతని ఫోటోలు, చేతి వేలి ముద్రలు సేకరించారు. ఆ తరువాత బెయిల్ పై విడుదలైన తనూజ్ మళ్లీ పోలీసులకు చిక్కలేదు. ఈ క్రమంలో ఈ నెల 13న పోలీసులు వెతుకుతున్న ఈ పాత నేరస్తుడు ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ప్రాంతానికి వస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం అందింది. తనూజ్ పాత ఫోటో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నది ఒకటి పట్టుకుని పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
వచ్చిన అన్ని కార్లను వెతుకుతుండగా, నల్లటి ఐ20 హ్యాచ్ బ్యాక్ కారులో వచ్చిన ఓ వ్యక్తి పోలీసులను చూసి కారుదిగి పరుగందుకున్నాడు. దీంతో అతనిని వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అయితే వాళ్ల దగ్గరున్న ఫోటోకు, పట్టుకున్న వ్యక్తికి ఏమాత్రం పొంతనలేకపోయినా.. వేలిముద్రలు, పాత నేరస్థుల సాయంతో అతనిని తనూజ్ గా గుర్తించారు. ఆ తరువాత అతనిని విచారించగా, బెయిల్ పై విడుదలైన అనంతరం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని కునాల్ మహేశ్వర్ గా మారినట్టు తెలిపాడు. ఆ తరువాత సుమారు 70 కార్లను దొంగిలించినట్టు తెలిపాడు. తాజాగా పోలీసులకు పట్టుబడిన కారును కూడా ఫరీదాబాద్ వద్ద దొంగిలించి తెచ్చినట్టు గుర్తించారు.
అనంతరం అతని నుంచి 12 కార్లను రికవరీ చేశారు. అతనిచ్చిన సమాచారంతో ఇంజన్, ఛాసీస్ నెంబర్ మార్చే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తనతో పాటు ఆయుధాలను ఉంచుకునే తనూజ్ ఒకసారి పోలీసులపై కాల్పులు కూడా జరిపాడు. పోలీసులకు దొరికిపోవడంతో చిత్తరంజన్ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం కూడా చేశాడని వారు వెల్లడించారు. అతను మొత్తం 150 కార్లను దొంగిలించాడని పోలీసులు చెబుతున్నారు.