america: తల్లి కళ్లముందే కొడుకు పక్కన పడిన పిడుగు... త్రుటిలో తప్పిన ముప్పు.. వీడియో చూడండి!
- వర్షంలో ఆడుకుంటున్న కొడుకు
- గొడుగు పట్టుకుని ఆడుకుంటుండడంతో అభ్యంతరం చెప్పని తల్లి
- అదే సమయంలో బాలుడికి దగ్గర్లో పడిన పిడుగు
- తల్లి తీసిన వీడియోలో ఆ దృశ్యాలు నిక్షిప్తం
వర్షంలో ఆడుకోవడమంటే పిల్లలకు ఎంతో సరదా. అయితే ఈ సరదా ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుందని తాజాగా ఓ సంఘటన మనకు చెబుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... అర్జెంటీనాలోని పొసాడాస్ లో తెల్లవారు జామున వర్షం పడుతోంది. డ్రెయిన్ పైప్ నుంచి నీరు ధారగా కిందపడుతోంది. దాని కింద సరదాగా పిల్లాడు గొడుగు పట్టుకుని ఆడుకుంటున్నాడు. దీంతో బాలుడి తల్లి కరొలినా ఆ అందమైన దృశ్యాన్ని వీడియో తీయడం ఆరంభించింది.
ఇంతలో పిల్లాడు ఇంట్లోకి వెళ్లేందుకు వెనుదిరిగాడు. అంతలోనే తల్లి కళ్ల ముందే బాలుడి పక్కగా పెద్ద మెరుపుతో ఓ పిడుగు పడింది. దీంతో బాలుడు కిందపడిపోయాడు. పిడుగు పాటుకి ఆమె గుండె ఆగినంతపనైంది. అయితే పిడుగు బాలుడిపై పడకపోవడం, బాలుడికి ఏమీ కాకపోవడంతో ఆమె హాయిగా ఊపిరిపీల్చుకుంది. దీంతో, బాలుడికేమీ కాలేదని, దేవుడికి ధన్యవాదాలని కరొలినా తెలిపింది.
'ఇలా ఎప్పుడూ మీ పిల్లల్ని వర్షంలో ఆడుకోనివ్వకండి' అంటూ ఆమె తల్లిదండ్రులకు సందేశాన్ని ఇస్తోంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూడండి. వీడియోలో పిడుగు పడడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.