telgi: అత్యంత విషమంగా అబ్దుల్ కరీం తెల్గీ ఆరోగ్యం!
- ఎయిడ్స్ సహా పలు వ్యాధులతో బాధపడుతున్న తెల్గీ
- వెంటిలేటర్ పై ఉంచి చికిత్స
- 2001లో స్టాంప్ కుంభకోణంలో అరెస్ట్
- 30 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
స్టాంప్ పేపర్ల కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నేరం రుజువై, జైలు శిక్షను అనుభవిస్తున్న అబ్దుల్ కరీం తెల్గీ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఎయిడ్స్ సహా, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందిస్తున్నారని తెల్గీ తరఫు న్యాయవాది ఎంటీ నానాయ్య వెల్లడించారు.
ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి సంతృప్తికరంగా లేదని అన్నారు. ఆయన్ను కేవలం నాలుగు రోజుల ముందే ఆసుపత్రిలో చేర్చారని, మరికొన్ని రోజుల ముందే చేర్పించి వుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మెదడు నుంచి వెన్నెముకకు దారితీసే కండరాలు, రక్తనాళాలు బలహీనపడ్డాయని, దీంతో ఆయన లేవలేకున్నారని తెలిపారు.
కాగా, అజ్మీర్‌లో నవంబర్ 2001లో తెల్గీని అరెస్ట్ చేయగా, 30 సంవత్సరాల శిక్ష పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. ఆయనపై రూ. 202 కోట్ల జరిమానాను విధించగా, ఆ డబ్బును ఆయన కట్టలేదు.