habul: రెండు గెలాక్సీలు ఢీ కొడితే ఏం జరుగుతుందో తెలుసా?
- ఫొటో విడుదల చేసిన నాసా
- ఫొటో తీసిన హబుల్ టెలిస్కోప్
- శూన్యంలో మెరుపుల ముడిలా కనిపిస్తున్న గెలాక్సీలు
విశ్వాంతరాళంలో మనం నివసిస్తున్న పాలపుంత గెలాక్సీ కాకుండా ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. అలాంటి గెలాక్సీలు ఒకదానికొకటి ఢీకొన్నపుడు ఏం జరుగుతుందో తెలుసా... అవి రెండు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఇలా రెండు గెలాక్సీలు కలిసిపోతున్న దృశ్యం హబుల్ టెలిస్కోప్ పంపిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైన ఫొటోలను నాసా విడుదల చేసింది.
శూన్యంలో రెండు మెరుపులు ముడిపడి కలిసిపోతున్నట్లుగా ఈ దృశ్యం ఉంది. గెలాక్సీల కలయిక చివరి దశలో ఉన్నపుడు ఇలా ముడి ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ ముడికి ఎన్జీసీ 2623 అని పేరు పెట్టారు. మన గెలాక్సీ అయిన పాలపుంత, పక్కనే ఉన్న ఆండ్రోమిడా గెలాక్సీని ఢీ కొట్టి, కలయిక జరిగి ఇలా ముడిపడే దశకు చేరుకోవడానికి దాదాపు 4 బిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.