punjab: పంజాబ్ లో అంతే!: కుక్క, పిల్లి, బర్రె, పంది, ఏనుగు.. ఇలా మీ వద్ద ఏది ఉన్నా సరే.. ట్యాక్స్ కట్టాల్సిందే!
- ఉత్తర్వులు జారీ చేసిన పంజాబ్ ప్రభుత్వం
- 200 నుంచి 500 వరకు పన్ను
- పన్ను చెల్లించకపోతే జంతువులను స్వాధీనం చేసుకుంటారు
రకరకాల పన్నులతో ప్రజలు ఇప్పటికే సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే నిర్ణయం తీసుకుంది. పెంపుడు జంతువులపై పన్ను విధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పిల్లి, కుక్క, పంది, గుర్రం, ఆవు, ఏనుగు, ఒంటె, బర్రె ఇలా ఏ పెంపుడు జంతువుకైనా పన్ను కట్టాల్సిందే.
పంచాయతీలను మాత్రం ఈ పన్ను పరిధి నుంచి మినహాయించారు. జంతువులను బట్టి రూ. 200 నుంచి 500 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ పన్ను కట్టకపోతే... మున్సిపల్ సిబ్బంది ఆ జంతువులను స్వాధీనం చేసుకుంటారు. అయితే, కోళ్లు, చిలుకలు, పావురాలు వంటి పక్షులకు కూడా పన్ను వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.