పాత నోట్ల రద్దు: పాత నోట్లను రద్దు చేసి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో... నవంబర్ 8న దేశ వ్యాప్త నిరసనలు!
- వచ్చేనెల 8న బ్లాక్ డే
- ఈ శతాబ్దంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం: గులాం నబీ ఆజాద్
- రేపు ఢిల్లీలో వామపక్ష నేతల సమావేశం: సీతారాం ఏచూరి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత నోట్లను రద్దు చేసి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో వచ్చేనెల 8న బ్లాక్ డే పాటించాలని విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన కారణంగా దేశ వ్యాప్తంగా ఆ రోజున నిరసనలు జరపాలని పేర్కొన్నాయి. నవంబర్ 8 ఈ శతాబ్దంలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్త నిరసనలు చేపట్టాలని మొత్తం 18 రాజకీయ పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు మరణించిన ఘటన ప్రపంచ చరిత్రలో ఇదేనని ఆయన విమర్శించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ విషయంపై మాట్లాడుతూ.. వచ్చేనెల 8న దేశ వ్యాప్త నిరసనలు జరుపుతామని, ఈ విషయమై చర్చించేందుకు రేపు ఢిల్లీలో వామపక్ష నేతలు సమావేశమవుతారని అన్నారు. కాగా, నల్లధనానికి, నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది 8న పాత నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, సరైన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రజలకు డబ్బు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంకుల ముందు లాఠీఛార్జీలు కూడా జరిగాయి. పెద్దనోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.