chennai: చెన్నైలో కుక్క‌ను పోగొట్టుకున్న జ‌ర్మ‌న్‌ దంప‌తులు... వెతికిపెట్టిన జంతు ప్రేమికులు!

  • మెరీనా బీచ్‌లో కుక్క‌ను దొంగిలించిన ఆటో డ్రైవ‌ర్‌
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన జ‌ర్మ‌న్‌ జంట‌
  • వాట్సాప్‌, ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ల ద్వారా కుక్క‌ను వెతికిన జంతు ప్రేమికురాలు

సాధార‌ణంగా చాలా మంది పెంపుడు జంతువుల‌ను త‌మ ఇంట్లో మనిషిగానే చూస్తారు. అలాగే జ‌ర్మ‌నీకి చెందిన జానిన్ షారెన్‌బ‌ర్గ్‌, స్టెఫెన్ క‌గేరాలు కూడా ఓ కుక్క‌ను పెంచుకున్నారు. లాబ్రడార్ జాతికి చెందిన ఈ కుక్క‌ను వారు గ్రీసు నుంచి తెచ్చుకున్నారు. లూక్ అని పేరు పెట్టి ప్రేమ‌గా పెంచుకుంటున్నారు. దానికి ప్ర‌త్యేకంగా పెట్ పాస్‌పోర్టు, మైక్రోచిప్ ట్రాక‌ర్ తీసుకుని వారితో ప్ర‌పంచ సంద‌ర్శ‌న‌కు తీసుకెళ్లారు. అందులో భాగంగా ఇటీవ‌ల జులైలో చెన్నై వ‌చ్చారు. అక్క‌డ మెరీనా బీచ్‌లో ఓ ఆటో డ్రైవ‌ర్ లూక్‌ను దొంగిలించాడు.

లూక్ కోసం చాలా చోట్ల వెతికారు. అయినా ప్ర‌యోజనం లేదు. దీంతో బ్లూ క్రాస్ సంస్థ‌లో, పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌లో కూడా ప్ర‌చారం మొద‌లు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ దొర‌క‌క‌పోవ‌డంతో తిరిగి జ‌ర్మ‌నీ వెళ్లిపోయారు. అయితే చెన్నైకి చెందిన కొంత‌మంది జంతుప్రేమికులు మాత్రం లూక్ కోసం వెత‌క‌డం ఆప‌లేదు. ముఖ్యంగా బేస‌న్ న‌గ‌ర్‌కి చెందిన విజ‌యా నారాయ‌ణ‌న్ అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించింది. త‌న‌కు తెలిసిన జంతు ప్రేమికులకు, సంక్షేమ సంస్థ‌ల‌కు స్వ‌యంగా వెళ్లి లూక్ కోసం వెత‌క‌మ‌ని చెప్పింది. అంతేకాకుండా కుక్క‌ను తీసుకువ‌చ్చిన వారికి రూ. 50వేలు బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని ప‌త్రికా ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చింది.

చివ‌రికి విజ‌యా నారాయ‌ణ‌న్ ప్ర‌య‌త్నం ఫ‌లించింది. తాము లూక్‌ను చూశామంటూ చాలా మంది ఆమెకు కాల్స్‌, మెయిల్స్ చేశారు. ఎట్ట‌కేల‌కు లూక్ దొరికింది. ఈ విష‌యాన్ని జానిన్‌, స్టెఫెన్‌ల‌కు విజ‌యా నారాయ‌ణ‌న్ తెలియ‌జేసింది. వారు వ‌చ్చే వ‌ర‌కు లూక్‌ని త‌న ఇంట్లోనే ఉంచుకుంది. ఇటీవ‌ల అక్టోబ‌ర్ 23న జానిన్ దంప‌తులు వ‌చ్చి, త‌మ లూక్‌ను వెతికిపెట్టినందుకు విజ‌యాకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

  • Loading...

More Telugu News