motorola: ఇప్పుడు మోటరోలా వంతు... ఛార్జింగ్ పెట్టిన 20 నిమిషాల్లో పేలిన మోటో ఈ5.. వీడియో చూడండి
- హర్యానాలో ఘటన
- ఫోన్లో నుంచి పొగలు
- పూర్తిగా కాలిపోయిన బ్యాటరీ
స్మార్ట్ఫోన్లు పేలిపోతున్న ఘటనల వార్తలు రోజుకొకటి వినిపిస్తున్నాయి. ఆ విధంగా ఇప్పటివరకు రెడ్ మీ, శాంసంగ్ ఫోన్లు ఎక్కువగా పేలినట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇటీవల కొత్తగా వచ్చిన జియో ఫీచర్ ఫోన్ కూడా పేలిందని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అవి తమ అమ్మకాలను దెబ్బతీయడానికి సృష్టిస్తున్న పుకార్లని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇదే బాటలో ఇప్పుడు మోటరోలా స్మార్ట్ఫోన్లు కూడా పేలుతున్నట్లు తెలుస్తోంది. తన మోటో ఈ5 ఫోన్ నుంచి ఛార్జింగ్ పెట్టిన 20 నిమిషాలకే పొగలు వచ్చాయని, బ్యాటరీ పూర్తిగా దగ్ధమైందని హర్యానాకు చెందిన సచిన్ యాదవ్ చెబుతున్నాడు. అతని మాటలకు సాక్ష్యంగా వీడియోను కూడా చూపిస్తున్నాడు.
`2016 సెప్టెంబర్లో ఈ ఫోన్ కొన్నాను. దానితో పాటు వచ్చిన ఛార్జర్నే వాడుతున్నాను. నిన్న ఉదయం ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికి ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో నా భార్య ఫోన్ తీసుకుని వీడియో తీశాను. దీని గురించి కస్టమర్ కేర్కి తెలియజేశాను. వారికి ఫొటో కూడా పంపించాను. తర్వాత వారి నుంచి సమాధానం లేదు` అని సచిన్ తెలిపాడు.
అయితే దీనిపై స్పందించిన మోటరోలా ప్రతినిధులు... ఘటనకు సంబంధించిన వినియోగదారుడితో మాట్లాడినట్లు, ఎలా జరిగిందో తెలుసుకోవడానికి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.