Chandrababu: మొత్తానికి ఓకే.. అమరావతి ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి.. ఊపందుకోనున్న పనులు
- రెండో రోజు సమావేశంలో ఆకృతులకు గ్రీన్ సిగ్నల్
- ఇక ఊపందుకోనున్న నిర్మాణ పనులు
- పనులను వేగంగా జరిగేలా చూడాలని సీఆర్డీఏకు ఆదేశం
అమరావతి ఆకృతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తానికి ఓకే చెప్పారు. లండన్లోని నార్మన్ ఫోస్టర్ కార్యాలయంలో వరుసగా రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో ఆర్కిటెక్టులు సమర్పించిన ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు, శాసనసభ భవంతుల ఆకృతులలో చిన్నచిన్న మార్పులు సూచించిన చంద్రబాబు వీలైనంత వేగంగా నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.
సచివాలయాన్ని మొత్తం ఐదు టవర్లుగా నిర్మించనున్నారు. ఇందులో మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 4 టవర్లు ఉంటాయి. వీటికి కొంచెం దూరంగా సీఎం, ముఖ్యమంత్రి కార్యదర్శుల కార్య స్థానాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం తదితర వాటితో మరో టవర్ ఉంటుంది. ఆకృతుల పరిశీలన దాదాపు పూర్తికావడంతో ఇక పనులను వేగిరం చేసేలా చూడాలని సీఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.