kancha ilaiah: విజయవాడలో సెక్షన్ 144.. ఐలయ్య అడుగుపెడితే అరెస్టే!
- 28న ఐలయ్యకు సన్మానం తలపెట్టిన అభిమానులు
- మరోపక్క ఆత్మీయ సభలు నిర్వహిస్తామంటున్న ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు
- అనుమతులు ఇవ్వని పోలీసులు
'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకంతో కంచ ఐలయ్య వివాదాన్ని రాజేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం చివరకు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ పుస్తకానికి సమర్థనగా ఈ నెల 28వ తేదీన విజయవాడలో కంచ ఐలయ్యను సన్మానించేందుకు బహుజనులు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఆత్మీయ సభలను నిర్వహించేందుకు ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు ప్రయత్నిస్తున్నారు. అనుమతి కోసం పోలీస్ కమిషనర్ ను కూడా సంప్రదించారు. అయితే, అనుమతి ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచే విజయవాడలో సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది. ఇప్పటికే సెక్షన్ 30 అమల్లో ఉంది.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, సభల కోసం ఎవరికీ అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఈ సభల వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో, విజయవాడలో ఐలయ్య అడుగుపెడితే అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.