flight: విమానంలో ఆమె ఒక్కతే ప్రయాణికురాలు... వీఐపీ సేవలు అందించిన సిబ్బంది!
- ట్విట్టర్లో ఫొటో షేర్ చేసిన స్కాట్లాండ్ రచయిత్రి
- సిబ్బంది బాగా చూసుకున్నారని వ్యాఖ్య
- ఇలాంటి ప్రయాణాలు చాలా అరుదన్న విమానయాన సంస్థ
విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్నది. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టిక్కెట్ కొన్న వారు ఒక్కరు ఉన్నా, వారిని గమ్యస్థానానికి చేర్చేందుకు విమానయాన సంస్థలు విమానాలు నడుపుతాయి. ఇక విమానంలో ప్రయాణికులు ఒక్కరే ఉండటం చాలా అరుదు. కానీ అలాంటి అనుభవమే స్కాట్లాండ్ రచయిత్రి కారోన్ గ్రీవీకి ఎదురైంది. గ్లాస్కో నుంచి హెరాక్లియోన్ వెళ్లడానికి ఆమె టిక్కెట్ కొన్నారు. అయితే 189 మంది సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ విమానంలో ప్రయాణం చేయబోయేది తానొక్కతే అని తెలుసుకుని కారోన్ ఆశ్చర్యపోయింది.
నిజానికి మరో ఇద్దరు ప్రయాణికులు రావాల్సి ఉంది. కానీ వారు రాలేకపోవడంతో విమానంలో వీఐపీ సేవలు అందుకునే అవకాశం కారోన్కి దక్కింది. ఈ విషయాన్ని తాను ట్విట్టర్లో ఫొటో పోస్ట్ చేసి మరీ పంచుకుంది. విమాన సిబ్బంది తనను చాలా బాగా చూసుకున్నారని, వారందరితోనూ ముచ్చటించానని పేర్కొంది. అయితే ఇలాంటి ప్రయాణాలు చాలా అరుదుగా జరుగుతాయని, సీజన్ కాకపోవడం వల్ల ప్రయాణికులు తక్కువగా ఉంటారని విమానయాన సంస్థ ఏజేసీ పేర్కొంది.