sexual assault: `లైంగికంగా వేధించిన అధ్యాపకుల పేర్లు ఇవ్వండి` అంటూ ఫేస్బుక్లో పోస్ట్... బయటపడిన 61 మంది పేర్లు!
- పోస్ట్ పెట్టిన కాలిఫోర్నియా యూనివర్సిటీ డేవిస్ స్కూల్ విద్యార్థిని
- ఎక్కువ మంది ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకులే
- మిశ్రమంగా స్పందిస్తున్న నెటిజన్లు
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్ స్కూల్‌కి చెందిన లా విద్యార్థిని రాయా సర్కార్ తన ఫేస్బుక్ ఖాతాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. విశ్వవిద్యాలయంలో తనను వేధిస్తున్న ముగ్గురు అధ్యాపకుల పేర్లను ప్రస్తావించి, తనలాగే ఎవరైనా అధ్యాపకుల లైంగిక వేధింపులకు గురైతే ఆ అధ్యాపకుల పేర్లను ఇవ్వండంటూ ఆమె పోస్ట్ చేసింది.
దీంతో, కొంతమంది విద్యార్థినులు తమను వేధించిన అధ్యాపకుల పేర్లను ఇచ్చారు. ఆ పేర్లన్నింటినీ రాయా పోస్ట్ చేసింది. అందులో 30 విశ్వవిద్యాలయాలకు చెందిన దాదాపు 61 మంది అధ్యాపకుల పేర్లు ఉన్నాయి. విశేషం ఏమిటంటే, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులే ఈ జాబితాలో ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, జేఎన్‌యూ, కోల్‌కతాలో సెయింట్ జేవియర్ కాలేజీ అధ్యాపకులు కూడా ఉన్నారు.
ఆమె పోస్ట్ చేసిన జాబితా ఇప్పుడు `రాయా సర్కార్ లిస్ట్` పేరుతో ఇంటర్నెట్లో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఆమె ఇలా జాబితాను వెల్లడించడంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమె చేసిన పనిని మెచ్చుకుంటుండగా, మరికొంతమంది మాత్రం ఇలా విచారణ లేకుండా అధ్యాపకుల పేర్లను వెల్లడించడం సబబు కాదని ఆరోపిస్తున్నారు. విద్యార్థినులు పంపిన పేర్లలో అమాయకులు కూడా ఉండొచ్చు కదా!... అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది ఆమె పోస్టును రిపోర్ట్ చేయడంతో ఫేస్బుక్ రాయా సర్కార్ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే దాన్ని మళ్లీ పునరుద్ధరించినట్లు రాయా మరో పోస్ట్ ద్వారా పేర్కొంది.