BSE: లాభాలవైపు ఎగిరి.. చివర్లో కిందకు జారిన స్టాక్ మార్కెట్!
- చివరి అరగంట వ్యవధిలో అమ్మకాల వెల్లువ
- నిమిషాల వ్యవధిలో 130 పాయింట్ల పతనం
- దాదాపు స్థిరంగా నిలిచిన స్టాక్ మార్కెట్
సెషన్ ఆరంభం నుంచి ఒడిదుడుకుల మధ్య లాభాల్లోనే కొనసాగిన బెంచ్ మార్క్ సూచికలు, మధ్యాహ్నం మూడు గంటల తరువాత మాత్రం ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. క్రితం ముగింపు 33,145తో పోలిస్తే, నేటి ఆరంభంలోనే సెన్సెక్స్ 33,270 పాయింట్లకు దూసుకెళ్లింది. ఆపై ఓ దశలో 33,285 పాయింట్ల రికార్డు స్థాయిని తాకింది. ఆ సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రయత్నించడంతో అరగంట వ్యవధిలోనే సెన్సెక్స్ నష్టాల్లోకి పడిపోయింది. చివరి రెండు నిమిషాల వ్యవధిలో నిలదొక్కుకుని క్రితం ముగింపుతో పోలిస్తే 10 పాయింట్ల నామమాత్రపు లాభాన్ని నమోదు చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చివర్లో కూడా నిలదొక్కుకోలేక నష్టాల్లోనే కొనసాగింది.
శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 10.09 పాయింట్లు పెరిగి 0.03 శాతం లాభంతో 33,157.22 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 20.75 పాయింట్లు పడిపోయి 0.20 శాతం నష్టంతో 10,323.05 పాయింట్ల వద్దకు చేరాయి.
బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.28 శాతం, స్మాల్ క్యాప్ 0.35 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ తదితర కంపెనీలు లాభపడగా, ఇన్ ఫ్రాటెల్, యస్ బ్యాంక్, ఐఓసీ, హింద్ పెట్రో, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,42,41,983 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మొత్తం 2,852 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1389 కంపెనీలు లాభాలను, 1,313 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.