kancha ilaiah: మా ఇంటి ముందు పోలీసులున్నారు.. గృహ నిర్బంధం చేస్తారేమో!: కంచ ఐలయ్య
- విజయవాడలో రేపు కంచ ఐలయ్య సన్మానసభకు అనుమతి లేదన్న పోలీసులు
- కంచ ఐలయ్యకు నోటీసులు జారీ
- ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి పోరాడుతూనే ఉంటా: కంచ ఐలయ్య
- నన్ను గృహ నిర్బంధంలో ఉంచుతారేమో
విజయవాడలో రేపు కంచ ఐలయ్యకు సన్మానసభ నిర్వహించనున్న నేపథ్యంలో వివాదం
చెలరేగుతోన్న విషయం తెలిసిందే. ఆ సభతో పాటు ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలు నిర్వహించనున్న సభకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌తో పాటు పోలీసు యాక్ట్ 30 అమలులో ఉన్నందున కంచ ఐలయ్యకు విజయవాడ పోలీసులు నోటీసులు పంపించారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ రేపటి సభ గురించి తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు.
అగ్రకులాల వారు కిందికులాల వారికి విద్య అందకుండా చేశారని, ఇప్పుడు కూడా మాతృభాషలోనే విద్య అంటూ కుట్రలు పన్నుతున్నారని కంచ ఐలయ్య అన్నారు. తమ పిల్లలని మాత్రం అగ్రకులాల వారు ఇంగ్లిష్ మీడియం విద్యాలయాల్లోనే చదివించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరి తీరు ఎలాగ ఉందో అందరూ గమనిస్తున్నారని అన్నారు. తాము సభ జరుపుకుంటామంటే అసాంఘిక శక్తులు వస్తాయని వ్యాఖ్యలు చేస్తున్నారని, అసలు అసాంఘిక శక్తులు ఎవరు? అని ఐలయ్య ప్రశ్నించారు.
తనకు విజయవాడ పోలీసుల నుంచి నోటీసులు అందాయని ఈ విషయంపై తాము చర్చలు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి తాను పోరాడుతూనే ఉంటానని, వారికి ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగాల కోసం ఉద్యమిస్తూనే ఉంటానని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, తన ఇంటి ముందు ప్రస్తుతం పోలీసులు ఉన్నారని, తనను గృహ నిర్బంధంలో ఉంచుతారేమోనని కంచ ఐలయ్య అనుమానం వ్యక్తం చేశారు.