world bank: తమ ఖాతాల్లో డబ్బులొచ్చి పడతాయనుకున్నారట... 'జన్ ధన్'పై వరల్డ్ బ్యాంక్ సర్వే ఫలితాలు!
- జన్ ధన్ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందని భావించిన 12 రాష్ట్రాల ప్రజలు
- జన్ ధన్ ఖాతాల నిర్వహణపై సర్వే నిర్వహించిన వరల్డ్ బ్యాంక్
- 5,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు వేస్తారని అంచనా
ప్రధాని నరేంద్ర మోదీ జన్ ధన్ యోజన ఖాతాలను తెరవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. డిజిటల్ సేవలు, నగదు లావాదేవీల నిర్వహణతో పాటు, ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరాలంటే జన్ ధన్ యోజన ఖాతాలు తెరవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపుకు స్పందించి కోట్లాది మంది జన్ ధన్ ఖాతాలు తెరిచారు. ఇది రికార్డు పుటలకు కూడా ఎక్కింది. దీంతో దీనిపై వరల్డ్ బ్యాంక్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జన్ ధన్ ఖాతాలు తెరవడం వెనుక ప్రజలు భావించిన కారణాలు వెల్లడయ్యాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో వరల్డ్ బ్యాంక్ ఈ సర్వే నిర్వహించింది.
జన్ ధన్ ఖాతా ఓపెన్ చేసిన తరువాత ప్రభుత్వం ఆయా ఖాతాల్లో నగదు వేస్తుందని అత్యధికులు భావించినట్టు సర్వేలో తేలింది. 46% మంది బీహారీలు మోదీ విదేశాల నుంచి నల్లధనాన్ని వెలికి తీసి, ఆ డబ్బును ఈ ఖాతాల్లో వేస్తారని భావించగా, మరికొందరు ప్రభుత్వం ఐదు వేల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తుందని ఆశించినట్టు సర్వే తెలిపింది.
ఇలాంటి ఆలోచనలే 31% మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాసులకు కూడా ఉన్నాయని తెలిపింది. ఖాతాలు తెరవగానే 5000 రూపాయలు వచ్చి తమ ఖాతాల్లో పడిపోతాయని ఆశించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల కింద సబ్సిడీ మొత్తాలను కూడా ఈ ఖాతాల్లో వేస్తుందని రాజస్థాన్, హర్యాణా, బిహార్ రాష్ట్రాల ప్రజలు భావించినట్టు తెలిపింది. ఇలా ప్రభుత్వం 5,000 రూపాయల నుంచి లక్షన్నర రూపాయలు తమ ఖాతాల్లో వేస్తుందని భావించారని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది.