Kodandaram : ఈ నెల 31న కొలువులకై కొట్లాట.. తరలిరండి: కోదండరామ్
- పౌరులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
- సరూర్ నగర్ స్టేడియం లేక ఎన్టీఆర్ స్టేడియంలో సభ
- అనుమతి ఇవ్వడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారు
- కోర్టును ఆశ్రయించాం
పౌరులకు ఉద్యోగం, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 31న 'కొలువులకై కొట్లాట' పేరుతో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరూర్ నగర్ స్టేడియంలో ఈ సభను నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఆ సభ తప్పకుండా జరుగుతుందని, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరండని పిలుపునిచ్చారు.
ఈ సభ నిర్వహణ కోసం పోలీసులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని, పోలీసులు జాప్యం చేస్తున్నారని కోదండరామ్ తెలిపారు. ఇందుకోసం కోర్టును ఆశ్రయించామని, సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని తాము తెలంగాణ సర్కారుని కోరుతున్నామని తెలిపారు.