revant reddy: చంద్రబాబు నాయకత్వంలో అనుభవం వచ్చింది.. ఇక కేసీఆర్‌పై పోరాటమే: రేవంత్ రెడ్డి
- చంద్రబాబుతో నా ప్రయాణం మరిచిపోలేనిది
- చంద్రబాబు అనుచరుడిగా టీడీపీ నేతగా గుర్తింపు పొందాను
- కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి
- రైతులకు బేడీలు వేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు
టీడీపీకి, తన శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని తెలుపుతూ తెలుగు దేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. అందులో అనేక విషయాలను తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో చేసిన పోరాటాలు తనకు గొప్ప అనుభవాన్ని ఇచ్చాయని అన్నారు. సుదీర్ఘ రాజకీయాలు, పాలన అనుభవం ఉన్న చంద్రబాబుతో తన ప్రయాణం మరిచిపోలేనిదని పేర్కొన్నారు.
చంద్రబాబు సారథ్యంలో అనేక ప్రజా పోరాటాల్లో భాగస్వామి కావడం అదృష్టమని తెలిపారు. చంద్రబాబు అనుచరుడిగా టీడీపీ నేతగా గుర్తింపు పొందడం తాను గర్వించే విషయమని అన్నారు. టీడీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబుకి నమ్మకస్తుడిగా పనిచేశానని చెప్పారు. పార్టీలో తక్కువ సమయంలోనే తనకు గుర్తింపు వచ్చిందని అన్నారు.
పేదల బాగు కోసం ఎన్టీఆర్ తపించిన విధానం తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయని, తాను ఇక ఆయనపై పోరాడతానని రేవంత్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో రైతుల చేతులకి బేడీలు వేసి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు.