india: చైనా కొత్త ప్లాన్... బార్డర్ లో ఉండి ఇండియాపై కన్నేయాలని పేదలకు ఆఫర్!
- సరిహద్దుల్లో ఉండి చైనాను కాపాడండి
- పేద బాలికలకు సూచించిన జిన్ పింగ్
- స్థిర నివాసం ఉండేందుకు ప్రోత్సాహాలు
- ఇండియాపై నిఘాకు కొత్త ప్లాన్
ఇండియాతో ఉన్న సరిహద్దులపై నిత్యమూ నిఘా పెట్టడానికి చైనా కొత్త పన్నాగాన్ని పన్నింది. టిబెట్ లోని లూంజె కౌంటీకి సమీపంలో ఉన్న పశువుల కాపరులను, చైనా ప్రోత్సహిస్తోంది. భారత్ సరిహద్దులకు సమీపంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని, చైనాకు రక్షణగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ స్వయంగా సూచించారు.
తన టౌన్ షిప్ లో అభివృద్ధి లేమిని గురించి వివరిస్తూ, ఇద్దరు పేద బాలికలు జిన్ పింగ్ కు లేఖ రాయగా, దానికి బదులు పంపిన ఆయన భారత్, చైనా సరిహద్దుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మరింత మంది పశువుల కాపరులు అక్కడికి వచ్చి నివాసం ఉండేలా చూడాలని కూడా ఆ బాలికలను జిన్ పింగ్ కోరారు. కాగా, చైనా తన భూభాగమని వాదిస్తున్న అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలోనే లూంజె కౌంటీ ఉంది. ఈ ప్రాంతంలోని టిబెట్ వాసులకు దగ్గర కావడం ద్వారా భారత్ ను కొంతమేరకు అడ్డుకోవచ్చని చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది.