rahul gandhi: ఇక ఆయన 'పప్పు' కాదు... దేశాన్ని ఏలే సత్తా ఉంది: రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి అనూహ్య కితాబు
- పరిపక్వత చెందిన నేత రాహుల్
- మోదీ చరిష్మా తగ్గితే దూసుకొచ్చే రాహుల్
- కేంద్రమంత్రి రాందాస్ అథవాలే
ఇటీవలి కాలంలో తన వైఖరిని మార్చుకుని, పరిపక్వత చెందిన నేతగా ప్రవర్తిస్తూ, అధికార పార్టీని ముఖ్యంగా మోదీని ఇబ్బంది పెట్టేలా తనదైన శైలిలో దూసుకుపోతున్న రాహుల్ గాంధీని ప్రశంసిస్తున్న వారి జాబితాలో మరో నేత చేరిపోయారు. రాహుల్ ఇకపై తేలికగా తీసుకుని వదిలేసే నేత కాదని, ఆయన సత్తా పెరిగిపోతున్నదని ఎన్డీఏ ప్రభుత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత, కేంద్ర మంత్రి, రామ్ దాస్ అథవాలే వ్యాఖ్యానించారు.
"ఆయన ఇక ఎంతమాత్రమూ పప్పు కాదు. ఇప్పుడాయన చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఆయనలో మంచి నేత అయ్యే లక్షణాలు పెరుగుతున్నాయి" అని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయమంత్రిగా ఉన్న ఆయన అకోలాలో వ్యాఖ్యానించారు. శివసేన నేత సంజయ్ రౌత్ తరువాత రాహుల్ గురించి పాజిటివ్ గా మారిన నేత, కేంద్ర మంత్రి అథవాలే కావడం గమనార్హం.
ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా తగ్గితే, ఆ వెంటనే రాహుల్ గాంధీ మరింతగా పుంజుకుని, బీజేపీని అధికారానికి దూరం చేయగలడని ఆయన అన్నారు. శివసేన పార్టీ మహారాష్ట్రలో అధికారంలో భాగస్వామిగా ఉండి, మరోవైపు ప్రతిపక్ష హోదాను కూడా పోషిస్తోందని, ఒకేపార్టీ ఇలా రెండు వైపులా పనిచేయరాదని చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో అథవాలే కాంగ్రెస్ నేతను పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం.