pakistan: పాకిస్థాన్ అసెంబ్లీలో హనుమంతుని వెండి గద?... వైరల్ అవుతున్న 2014 నాటి వీడియో
- స్పీకర్ పోడియం ముందు గద
- హాస్యోక్తులు కురిపిస్తున్న నెటిజన్లు
- అసెంబ్లీలో గద ఉంచడం సంప్రదాయమట
2014 నాటి పాకిస్థాన్ అసెంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్గా మారుతోంది. అది వైరల్ అవడానికి కారణం సభికుల మధ్య చర్చలు కాదు.. సభాపతి ముందున్న ఒక ఆయుధం. అవును... ఈ వైరల్ వీడియోలో స్పీకర్ పోడియం ముందు వెండితో చేసిన గద ఉండటాన్ని నెటిజన్లు గమనించారు. అయితే ముస్లిం దేశమైనా పాకిస్థాన్ అసెంబ్లీలో హిందూ పురాణాల్లో కనిపించే గద ఎందుకుందని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరి కొంతమంది నెటిజన్లు హాస్యోక్తులు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
'హనుమంతుడి గదను కొట్టేశారు', 'పాకిస్థానీలు కూడా హనుమాన్ భక్తులే' అంటూ కామెంట్లు చేశారు. అయితే దీనికి సంబంధించిన అసలు కారణం కూడా ఒక నెటిజన్ వెల్లడించాడు. గణతంత్ర రాజ్యాల్లో పూజ చేసిన ఆయుధాలను అసెంబ్లీ స్పీకర్ పోడియం మీద ఉంచాలనే సంప్రదాయం ఉందట. దాదాపు అన్ని కామన్వెల్త్ రాజ్యాల్లో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారట. సమావేశాలు కొనసాగుతున్నాయనే దానికి ప్రతీకగా ఆయుధాన్ని ఉంచుతారట. గద మాత్రమే కాకుండా ఏదైనా ఒక పూజలు చేసిన ఆయుధాన్ని వుంచుతారని అతడు కామెంట్లో పేర్కొన్నాడు. ఈ వీడియోలో ఉన్న స్పీకర్ పేరు అగా సిరాజ్ ఖాన్ దుర్రాని. అప్పట్లో పాకిస్థాన్లో సంభవించిన నీలోఫర్ తుఫాన్ గురించి సభలో చర్చ జరగుతోంది.