utham: ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కనే నిలబడి చంద్రబాబును పొగిడిన రేవంత్ రెడ్డి!
- అక్కడ చంద్రబాబు అంతగా కష్టపడుతోంటే.. ఇక్కడ కేసీఆర్ మాత్రం ఇలా చేస్తున్నారు
- చంద్రబాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది
- చంద్రబాబుకి నమ్మిన బంటుగా ఉన్నా
- అటువంటి నాయకుడిని వదులకుని వచ్చా
ఎన్నో పన్నాగాలు పన్ని కేసీఆర్ సీఎం అయ్యారని, ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడేమో ఇలా ప్రవర్తిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కనే నిలబడి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రలో సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఎన్నో కష్టాలు పడుతుంటే, ఇక్కడ కేసీఆర్ ఏమీ చేయడం లేదని అన్నారు. చంద్రబాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, చంద్రబాబుతో కలిసి 10 సంవత్సరాలు పనిచేశానని అన్నారు. చంద్రబాబుకి నమ్మిన బంటుగా ఉన్నానని, అటువంటి నాయకుడిని వదులుకుని వచ్చానని చెప్పారు.
కేసీఆర్ చేస్తోన్న అసమర్థ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి కూడా తాను వెళ్లలేదని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం పార్టీలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు సమర్థించుకుంటున్నారని, కొద్ది సేపటికే మళ్లీ విమర్శించుకుంటున్నారని చెప్పారు. అందుకే తుది ఉద్యమం చేయాలనుకుంటున్నానని తెలిపారు.
బీజేపీ, ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ పెట్టుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు బాగుంటున్నాయని, నోట్లరద్దు, జీఎస్టీలను కేసీఆర్ సమర్థించారని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతు తెలిపారని అన్నారు. 'ఇన్ని చేశారు కేసీఆర్, మరి ఆయన మా వ్యక్తా? కాదా?' అని బీజేపీ నేతలు తనను అడిగారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.