chandrababu: ఏపీ ప్రభుత్వ ఖర్చుతో సింగపూర్ లో ఎంజాయ్ చేయడానికి బయలుదేరిన అమరావతి రైతులు!
- 123 మందికి సింగపూర్ వెళ్లే చాన్స్
- తొలి విడతలో బయలుదేరిన 34 మంది
- మొత్తం ఖర్చు రూ. 40 లక్షలు
ఆదాయం అంతంతమాత్రంగానే ఉన్నదని, నగదు లభ్యతలో కొరత ఉందని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతికి స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల్లో 123 మందిని ఎంపిక చేసి సింగపూర్ పర్యటనకు పంపింది. రైతుల జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండా హోటల్ బస నుంచి భోజనాలు, టిఫిన్సు, ప్రయాణాలు, ఇతర ఖర్చులన్నీ ఏపీ ప్రభుత్వం భరించనుంది.
వీరంతా తమ వద్ద ఉన్న డబ్బును ఎలా పెట్టుబడిగా పెట్టి లాభాలు ఆర్జించవచ్చన్న విషయాన్ని సింగపూర్ లో తెలుసుకుని వస్తారని అధికారులు చెబుతుండటం గమనార్హం. అమరావతి ప్రాంతంలో మొత్తం 33 వేల ఎకరాలను 26 వేల మంది రైతులు స్వచ్ఛందంగా అప్పగించిన సంగతి తెలిసిందే. భూములిచ్చిన రైతులకు పెట్టుబడులపై అవగాహన కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ, ఈ టూర్ కోసం రూ. 40 లక్షలు ఖర్చు పెడుతోంది.
తొలి విడతగా 34 మంది రైతులు ఎక్కిన బస్సును చంద్రబాబు సోమవారం నాడు జెండా ఊపి ప్రారంభించగా, వారంతా గన్నవరం విమానాశ్రయం చేరుకుని సింగపూర్ బయలుదేరారు. మొత్తం 4 బ్యాచ్ లలో 123 మంది రైతులను తొలి దశలో పంపుతామని, తరువాతి దశల్లో మరింత మంది రైతులను సింగపూర్ సందర్శనకు పంపుతామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.