singapore: హైటెక్ టెర్మినల్‌ను ఆవిష్కరించిన సింగపూర్ చాంగీ విమానాశ్రయం
- చెకిన్, బ్యాగేజీ డ్రాపింగ్.. అన్నీ సాంకేతికమే
- ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో పనిచేసే టెర్మినల్
- సిబ్బంది, ఇబ్బంది రెండూ లేని చాంగీ ఎయిర్పోర్ట్
సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయం మంగళవారం నాడు సరికొత్త టెక్నాలజీ టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి ఆటోమేషన్ ఉన్న చెకిన్ సిస్టం, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, కంప్యూటరైజ్డ్ బ్యాగేజీ డ్రాపింగ్ పాయింట్లు వంటి చాలా సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అయితే కొంతమంది ప్రయాణికులకు ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడం తెలియకపోయే సరికి సాధారణ కౌంటర్ల వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 985 మిలియన్ల సింగపూర్ డాలర్లు ఖర్చు చేసి విమానాశ్రయంలోని టెర్మినల్ 4ను ఇలా సాంకేతికమయం చేశారు.
ఈ టెక్నాలజీ సాయంతో ప్రయాణికులకు సిబ్బందితో అవసరం ఉండదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వారే చెకిన్, బ్యాగేజీ, బోర్డింగ్ వంటి పనులన్నింటినీ ఆమోదించే అవకాశం కలుగుతుంది. మొదటి రోజు 100 మందికి పైగా ప్రయాణికులు ఈ సాంకేతిక సేవలను వినియోగించుకున్నట్లు సమాచారం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు విమానాశ్రయ నిర్వాహకులు తెలిపారు.