jana reddy: అప్రజాస్వామిక పద్ధతిలో సభ జరుగుతోంది.. అందుకే, బాయ్ కాట్ చేశాం: జానారెడ్డి
- అప్రజాస్వామిక పద్ధతిలో సభ జరుగుతోంది
- స్పీకర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
- విపక్ష నేత చెప్పేది కూడా వినడం లేదు
అధికార పార్టీ టీఆర్ఎస్ పై శాసనసభలో విపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాయ్ కాట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చాలా దారుణంగా ఉందని చెప్పారు.
ప్రజల ఆశలకు టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని భావించామని... కానీ, సభలో కేవలం అధికారపక్ష నేతలకే అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. విపక్ష సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారని... అయితే మాట్లాడేలోపే మైక్ ను కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ప్రయోజనం లేదని అన్నారు.
విపక్ష సభ్యులంటే లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తున్నారని జానారెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేత చెప్పే విషయాన్ని కూడా వినే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మండిపడ్డారు. అప్రజాస్వామిక పద్ధతిలో సభ జరుగుతోందని... అందుకే సభను ఒకరోజు బాయ్ కాట్ చేశామని చెప్పారు.