tv debate: టీవీ చర్చలో వందేమాతరం గేయాన్ని తప్పుగా ఆలపించిన బీజేపీ నాయకుడు... వీడియో చూడండి
- ఫోన్లో చూసి కూడా సరిగా పాడలేకపోయిన నేత
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
- హేళన చేస్తూ కామెంట్లు విసురుతున్న నెటిజన్లు
వందేమాతరం గేయాన్ని అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వార్తా ఛానల్ చర్చా కార్యక్రమంలో జరిగిన సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధి నవీన్ కుమార్ సింగ్, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా ప్రతినిధి ముఫ్తీ ఇజాజ్ అర్షద్ ఖాస్మీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో భాగంగా నవీన్ కుమార్ను వందేమాతరం గేయం పాడాలని ముఫ్తీ రెచ్చగొట్టాడు.
అందుకు అయిష్టంగానే ఒప్పుకున్న నవీన్... గేయం పాడేటపుడు తనతో పాటు కలిసి పాడాలని ముఫ్తీకి షరతు విధించాడు. దానికి ముఫ్తీ ఒప్పుకోవడంతో నవీన్ పాడటం ప్రారంభించాడు. ముందు తడబడ్డాడు. దీంతో వెంటనే ఫోన్లో చూసి పాడటానికి ప్రయత్నించాడు. అప్పటికీ ఆయన సరిగా పాడలేకపోయాడు. పదాలను తప్పుగా పలకడం, పలికిన పదాలనే మళ్లీ పలకడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన వారంతా నవీన్ కుమార్ ను, బీజేపీని హేళన చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో కేంద్ర సహాయ మంత్రి బల్దేవ్ సింగ్ అవులక్ కూడా ఓ చర్చా కార్యక్రమంలో వందేమాతరం పాడటానికి వెనకాడిన సంఘటన వీడియోను పోస్ట్ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు.