brides: నేటి తరం మగువల పెళ్లికి ముందు షరతులు... కొత్త రిపోర్టులో ఆసక్తికర అంశాలు!
- ఉమ్మడి కుటుంబాలు వద్దంటున్న అమ్మాయిలు
- తొలుత ప్రొఫెషన్, ఆపైనే అందం
- కుల మతాలతో పని లేదంటున్న 65 శాతం మంది అమ్మాయిలు
- జాతకాలపై నమ్మకాలు లేవంటున్న సగం మంది
జీవిత భాగస్వామిని ఎంచుకుని, అతనితో కలసి ఏడడుగులూ నడిచి జీవితాన్ని పంచుకునే మధుర క్షణాలకు ముందు, నేటి తరం మగువ ఎంతమాత్రమూ రాజీ పడేందుకు సిద్ధంగా లేదని ఓ కొత్త సర్వే నివేదిక వెల్లడిస్తోంది. పెళ్లి విషయంలో అమ్మాయిల్లోని మనోభావాలపై ప్రశ్నించి తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం, ఈ కాలం అమ్మాయిలు పెళ్లి తరువాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండేందుకు సుముఖంగాలేరు. నలుగురితో కలిసుంటే, తమకు స్వేచ్ఛ ఉండదన్నది వారి భావన.
ఇక మనసుకు నచ్చితే, కులం, మతం, జాతకం వంటివి చూసేందుకు కూడా అమ్మాయిలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒకే ప్రొఫెషన్ లో ఉన్న వారైతే మంచిదని భావిస్తున్నారు. ప్రొఫెషన్ తరువాతే అమ్మాయిలు అందాన్ని చూస్తున్నారు. ఇక 80 శాతం మంది యువతులు విదేశీ వరుడు కావాలని కోరుకుంటుండగా, 65 శాతం మంది కుల మతాలతో పని లేదని, 50 శాతం మంది జాతకాలు చూడాలని అనుకోవడం లేదని అన్నారు. ఉమ్మడి కుటుంబం వద్దని 80 శాతం మంది, ఒకే రకమైన ఉద్యోగం చేస్తుంటే బాటుంటుందని 90 శాతం మంది వెల్లడించడం గమనార్హం.